News

   
     
S.No Subject
7 విజయవాడకు తరలివస్తున్న ఏ.బి.సి.  
  మే నెల రెండవ వారం నుండి బ్రాహ్మణ కార్పొరేషన్ ఆఫీసు విజయవాడకు తరలి వస్తుంది. గొల్లపూడిలోని ఎండోమెంట్స్ కమిషనర్ భవన ప్రాంగణంలోనే ఏ.బి.సి. కార్యాలయం  
     
6 క్రెడిట్ సొసైటీ ద్వారా మరో 400 మందికి పైగా ఉపాధి  
  వీరు కాక ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సహకార పరపతి సంస్థ (క్రెడిట్ సొసైటీ) ద్వారా 2016-17 లో మరో 400 మందికిపైగా (80-90 అరుంధతి, వశిష్ట గ్రూపులుగా) బ్రాహ్మణ స్త్రీ పురుషులు స్వల్ప మొత్తం (రూ.25,000, రూ.40,000) ఋణాలు పొంది సొంతంగా వివిధ ఉత్పత్తుల తయారీ/వర్తకం చేస్తూ డబ్బు ఆర్జిస్తున్నారు. వీరంతా మిఠాయిలు, ఇతర తినుబండారాల తయారీ, పోషకాహార ఉత్పత్తులు, టిఫిన్ సెంటర్లు, కాటరింగ్, పూజ సామగ్రి, ఫ్యాన్సీ వస్తువులు, బ్యాగులు, ఎంబ్రాయిడరీ, హస్త కళలు, టైలరింగ్, రెడీమేడ్ దుస్తులు, చీరల వ్యాపారం... ఇలా ఎన్నో రకాల పనులు చేస్తున్నారు. వీరి ఉత్పత్తుల విక్రయానికి సొసైటీ బ్రాహ్మణ బజార్ల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నది.
అటు చాణక్య లబ్ధిదారులకు, ఇటు క్రెడిట్ సొసైటీ సభ్యులకూ వారి వృత్తి వ్యాపారాల్లో, పరిశ్రమలు నడపడంలో, మార్కెటింగ్ లో శిక్షణ కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు.
 
     
5 ఇది అపురూపం! 431 మంది కొత్త పారిశ్రామల యజమానులు/వ్యాపారులు!  
  చాణక్య పథకం కింద ఒక్క 2016-17 సంవత్సరంలోనే 431 మందికి ఏ.బి.సి. సబ్సిడీ అందజేసింది. అంటే రాష్ట్రంలో 431 బ్రాహ్మణ కుటుంబాల వారు కొత్తగా ఔత్సాహిక స్వయం ఉపాధి రంగంలో సూక్ష్మ (మైక్రో), చిన్న తరహా పరిశ్రమల యజమానులుగా, వ్యాపారులుగా మారారు. మరెంతోమందికి ఉద్యోగం/ఉపాధి కల్పిస్తున్నారు. ఇది అపురూపం. వీరిలో 160 మంది మహిళలు. ఇది ఇంకా హర్షణీయం.
ప్రస్తుతం పరిశీలనలో ఉన్న దరఖాస్తుదారులలో ఇంకా ఎన్నో వందల మంది రానున్న కొద్ది నెలల్లోనే చాణక్య పథకం కింద సహాయంతో ఇదే విధంగా ముందడుగు వేయబోతున్నారు. ప్రభుత్వం నుండి తగినంతగా నిధులు లభిస్తే కార్పొరేషన్ ఇంకా కొన్ని వేలమంది ఔత్సాహిక బ్రాహ్మణులను ప్రోత్సహించి పరశ్రమల యజమానులుగా, వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దగలదు. ఈ సంస్థల ద్వారా మరికొన్ని వేలమందికి ఉద్యోగం/ఉపాధి లభిస్తుంది.
 
     
4 ఔత్సాహిక వ్యాపార పారిశ్రామిక రంగాల్లో బ్రాహ్మణుల ముందడుగు  
  బ్రాహ్మణులంటే సాధారణంగా ఎవరికైనా పెళ్ళిలో, శుభకార్యాలలో మంత్రాలు చదివే పురోహితులు, గుడిలో, ఇంట్లో, పందిళ్ళలో పూజలు-పునస్కారాలు చేయించే అర్చకులు, వంట బ్రాహ్మణులు... ఇంకా పాతకాలం వారికైతే గ్రామ కరణం, మందులిచ్చే ఆచారిగారు, నీళ్ళ కావిళ్ళు మోసే పేద పంతుళ్ళు గుర్తుకువస్తారు. వేద మంత్రోచ్చారణలు వినిపిస్తాయి.
రోజులు మారాయి. చదువులు, ఉద్యోగాలతో బ్రాహ్మణులంటే మనకు వెంటనే స్ఫురించే రూపం కొంత మారింది. అయినా టీచర్లు, ఉద్యోగులు, కొద్దిమంది డాక్టర్లు, లాయర్లు తప్ప వేరే రంగాలలో బ్రాహ్మణులు ఎక్కువగా కనపడరు. ఎక్కడో ఊరికి ఒకరిద్దరు మినహా పారిశ్రామిక రంగంలో, వాణిజ్యంలో ఈ సామాజిక వర్గంవారు అరుదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ (ఏ.బి.సి.)ను ఏర్పాటు చేసి గత రెండేళ్ళుగా పేద బ్రాహ్మణుల సంక్షేమానికి నడుం కట్టి విద్య, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహికులకు ప్రోత్సాహం, సంక్షేమ రంగాలలో వివిధ పథకాల ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నది.
పారిశ్రామిక, వ్యాపార, ఉత్పత్తి రంగాలలో, నైపుణ్యంతో కూడిన వృత్తులలో సామర్ధ్యం, తెలివి, ఆలోచనలు ఉన్నా ఆర్ధిక స్తోమత లేక చాలా మంది ఔత్సాహికులు ముందుకు రాలేకపోతున్నారు. వీరికోసం ఏ.బి.సి. చాణక్య స్వయం ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద బ్యాంక్ ఋణం తీసుకొని సూక్ష్మ (మైక్రో), చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమ, వృత్తి, వ్యాపారం చేపట్టే వారికి ఏ.బి.సి. సబ్సిడీ ఇస్తుంది. అంటే ఋణభారంలో చాలా భాగం కార్పొరేషన్ భరిస్తుంది.
 
     
3 ఆన్ లైన్ లోనే ఉంది అంతా!  
  బ్రాహ్మణ కార్పొరేషన్ వ్యవహారమంతా అత్యంత పారదర్శకంగా ఉండడానికి, ఈ సంస్థ నిర్వహణ ఖర్చులు అతి తక్కువగా ఉండడానికి ముఖ్యకారణం టెక్నాలజీ. సంస్థ పథకాల ప్రచురణ నుంచి దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల పత్రాల పరిశీలన, వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, అర్హుల ఎంపిక, లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల లోకి నేరుగా సొమ్ము చెల్లింపు వరకు మొత్తం ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది. ఏ.బి.సి. కి రాష్ట్రం మొత్తానికి ఒకటే కార్యాలయం. పట్టుమని పదిమంది ఉద్యోగులు. దరఖాస్తుల పరిశీలన పని ఎక్కువగా ఉన్నప్పుడు పొరుగుసేవల ద్వారా నియమించే మరికొద్దిమంది తాత్కాలిక ఉద్యోగులు. హైదరాబాద్ లో ఇప్పటివరకు ఉన్న ఈ ఆఫీసును కొద్ది రోజులలో విజయవాడ (గొల్లపూడి) తరలిస్తున్నారు.
కార్పొరేషన్ కు వేరెక్కడా కార్యాలయాలు లేవు, ఉద్యోగులు లేరు. దరఖాస్తుదారులంతా స్వయంగా ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. జిల్లాలలో, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సంస్థ గుర్తించిన/నియమించిన స్వచ్చంద సేవకులు కో-ఆర్డినేటర్లుగా ఉన్నారు. వారు, మరికొందరు వలంటీర్లు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన వారికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి, ఇతర డాక్యుమెంట్లు పంపడానికి సహాయం చేస్తారు. అంతకుమించి వీరికి సంస్థతోకాని, దరఖాస్తులతో కాని సంబంధంలేదు. ఈ కో-ఆర్డినేటర్లు, ఇతర బ్రాహ్మణ వలంటీర్లే గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన సభలు నిర్వహించి బ్రాహ్మణ కుటుంబాలకు కార్పొరేషన్ పథకాల గురించి తెలియజేస్తారు. క్రెడిట్ సభ్యులుగా చేరడానికి సహాయం చేస్తారు. ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
     
2 2016-17 లో బ్రాహ్మణ కార్పొరేషన్ లబ్ధిదారులు, వారికి ఇచ్చిన సొమ్ము మొత్తం:  
  • భారతి విద్యా పథకం, గాయత్రి విద్యా ప్రశస్తి: 18,270 (రూ.40 కోట్లు)
• చాణక్య స్వయం ఉపాధి పథకం: 431 (రూ.6.51 కోట్లు)
• వశిష్ట, ద్రోణాచార్య (పోటీ పరీక్షల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి) పథకాలు, ఉపాధి కల్పన: 330 (రూ.3.8 కోట్లు)
• కశ్యప (పింఛను), గరుడ సంక్షేమ పథకాలు: 14,000 (రూ.9.90 కోట్లు)
కార్పొరేషన్ కు 2016-17 సంవత్సంలో కేటాయించిన రూ.65 కోట్లు కాక, గత అక్టోబర్ లో రాష్ట్ర బ్రాహ్మణ సహకార పరపతి సంస్థ (క్రెడిట్ సొసైటీ) బ్యాంకింగ్ కార్యకలాపాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ సొసైటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.10 కోట్లు ఇచ్చింది.
ప్రస్తుత (2017-18) సంవత్సరం బడ్జెట్ లో బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.75 కోట్లు కేటాయించారు. యువజనుల నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, ఉపాధి కల్పన పథకాలను మరింత విస్తృతంగా అమలు చేయడానికి మరిన్ని నిధులు అవసరమని కార్పొరేషన్ వర్గాలవారు తెలియజేశారు.
కశ్యప పథకంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వపు ఇతర (వయోవృద్ధుల పించను వగైరా) పథకాల లబ్ధి పొందని సుమారు 12,000 మంది అట్టడుగు వర్గం పేద బ్రాహ్మణులకు నెలకు రూ.1000 పించను బ్రాహ్మణ కార్పొరేషన్ అందిస్తున్నది. ఈ భారాన్ని ఇతర సంక్షేమ, పించను విభాగాలకు బదిలీ చేస్తే ఏ.బి.సి. కి కొత్త పథకాల అమలుకు కొంత వెసులుబాటు కలుగుతుంది.
 
     
1 అత్యంత పారదర్శకంగా బ్రాహ్మణ కార్పొరేషన్ సహాయ కార్యక్రమాలు
దేశంలోనే తొలిసారి ముందడుగు వేసిన ఏ.పి. ప్రభుత్వానికి అన్నివర్గాల ప్రశంస
బ్రాహ్మణ సామాజిక వర్గంలో పేదలకు, నిస్సహాయులకు అండగా, వారి ఆర్ధిక-సామాజిక అభివృద్ధే లక్ష్యంగా రెండేళ్ళ కిందట ఏర్పాటు చేసిన రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంస్థ (వెల్ఫేర్ కార్పొరేషన్) తన ఆశయ సాధనవైపు వడివడిగా అడుగులు వేస్తోంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణుల కోసం కొత్త రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2014 డిసెంబర్ లో రూ.25 కోట్ల కేటాయింపుతో ప్రారంభమైన ఈ ఏ.బి.సి. కార్పొరేషన్ గత రెండేళ్ళలో మొత్తం సుమారు 44,100 మంది అల్పాదాయ బ్రాహ్మణులకు వివిధ పథకాల కింద రూ. 86.77 కోట్ల సహాయం అందజేసింది. ఎన్నో లక్షలమంది బ్రాహ్మణులు ఈ రోజు ప్రభుత్వానికి, కార్పొరేషనుకు ఎంతో కృతజ్ఞులై ఉన్నారు. ఊరూరా ముఖ్యమంత్రినీ ఈ పథకాలు రచించి అత్యంత పారదర్శకంగా, సమర్ధవతంగా అమలు చేస్తున్న సంస్థనూ వేనోళ్ళ ప్రశంసిస్తున్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికార పార్టీ నాయకులు శాఖల రివ్యూ సందర్భంలో, అనేక సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోకెల్లా ఏ.బి.సి. పనితీరు ఉత్తమమైనదని మెచ్చుకున్నారు.
కార్పొరేషన్ నిధుల్లో సగం పైగా భారతి, గాయత్రి వగైరా పథకాల ద్వారా విద్యార్ధులకే అందజేస్తున్నారు. యువజనుల నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, స్వయం ఉపాధికోసం, అనాధలు-వృద్ధులు-వితంతువుల వంటి నిస్సహాయుల కోసం ఏ.బి.సి. వినూత్న పథకాల ద్వారా మిగతా సగం నిధులు ఖర్చు చేస్తున్నది.